తమిళనాట మాస్ హీరోగా విజయ్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకి పండుగే. అలాంటి విజయ్ తాజా చిత్రంగా 'మెర్సెల్' తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్ మూడు విభిన్నమైన పాత్రలను పోషించగా, ఆయన సరసన కాజల్ .. సమంతా .. నిత్యామీనన్ నటించారు. దీపావళి కానుకగా ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.

అయితే 'నాన్ మెర్సెల్ అయిటేన్' అనే పేరుతో టైటిల్ ను రిజిస్టర్ చేయించిన వేరే నిర్మాత, తన టైటిల్ ను వీరు కాపీ కొట్టారంటూ కేసు వేశాడు. దాంతో 'మెర్సెల్' ప్రమోషన్స్ ను తాత్కాలికంగా నిలిపివేయమని మద్రాస్ హైకోర్టు కొన్ని రోజుల క్రితం ఆదేశాలిచ్చింది. దాంతో ఈ సినిమా టీమ్ తో పాటు అభిమానులు నిరాశ చెందారు. తాజాగా మద్రాస్ హైకోర్టు ఈ కేసును కొట్టేస్తూ .. 'మెర్సెల్' టైటిల్ వాడుకోవచ్చంటూ అనుమతినిచ్చింది. దాంతో ఈ సినిమా టీమ్ తేలికగా ఊపిరి పీల్చుకుంది .. అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ఈ భారీ చిత్రం దీపావళికి సంచలనాన్ని సృష్టిస్తుందేమో చూడాలి.