నీ చిరునవ్వు బాగుందన్న డొనాల్డ్ ట్రంప్.. ‘వింత ప్రవర్తన’ అంటూ మహిళా కరస్పాండెంట్ ట్వీట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీ చిరునవ్వు బాగుందన్న డొనాల్డ్ ట్రంప్.. ‘వింత ప్రవర్తన’ అంటూ మహిళా కరస్పాండెంట్ ట్వీట్!

పెర్రీ అనే మహిళా విలేకరితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్, ఐరిష్ ప్రధాని లియో వరాద్కర్ మధ్య దౌత్యపరమైన ఫోన్ సంభాషణను కవర్ చేసే నిమిత్తం ఆర్టీఈ వాషింగ్టన్ కరస్పాండెంట్ సైత్రియోనా పెర్రీ నిన్న ఓవల్ ఆఫీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా వారి సంభాషణ కొనసాగుతున్న సమయంలో ట్రంపే స్వయంగా అంతరాయం కలిగిస్తూ, ‘ప్రస్తుతం నా ముందు మీ ఐరిష్ ప్రెస్ ఉంది. అందరూ చాలా అందంగా ఉన్నారు’ అని ట్రంప్ అన్నారు.

అంతేకాకుండా, పెర్రీ అనే కరస్పాండెంట్ తో ‘కమ్ హియర్, కమ్ హియర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అని ఆయన ప్రశ్నించగా, సదరు కరస్పాండెంట్ స్పందిస్తూ..‘ఆర్టీఈ న్యూస్, సైత్రియోనా పెర్రీ’ అని చెప్పారు. ‘ఆమె ముఖంపై చిరునవ్వు చాలా బాగుంది...’ అని ఐరిష్ ప్రధానితో ట్రంప్ తన సంభాషణ కొనసాగించారు. దీంతో, నవ్వుకుంటూ వెళ్లిన పెర్రీ తన సీట్లో కూర్చుంది. అయితే, ఈ విషయమై ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేసి, సంబంధిత వీడియోను పెట్టింది. ‘ఐరిష్ ప్రధాని లియో వరాద్కర్ తో అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో సంభాషించే సమయంలో..  ఆయన వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో’ అని పేర్కొన్నారు. కాగా, ట్రంప్ తీరుపై నెటిజన్లు పలు విమర్శలు గుప్పిస్తున్నారు.

More Telugu News