Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అత్యంత విశా....లమైన కెమెరా

ఫోటో చక్కగా రావాలంటే మంచి కెమెరా ఉపయోగించాలి. కెమెరా గురించి తెలిసిన వారికి మంచి కెమెరా ఏదో ఇట్టే తెలిసిపోతుంది. అయితే ప్రస్తుతం మనకు తెలిసినవాటిలో తక్కువ మందిని బాగా తీయగలిగి, ఎక్కువ మందిని ఒకే వేదికపైన తీయాలంటే కాస్త ఇబ్బంది కలిగించేవే. ఎక్కువ మందిని ఒకే వేదికపై ఉంచి, వారిని ఒకే ఫ్రేమ్‌లో బిగించితే, కొందరు వంగిపోయినట్టు, లేదా పొడుగ్గా ఉండేవాళ్ళు పొట్టివాళ్లలా కనబడడం వంటి లోపాలు మనకు తెలుస్తుంటాయి. ఇలా ఎక్కువమందిని తీయాల్సి వచ్చినపుడు ఫిష్‌ ఐ లెన్స్‌లను ఉపయోగించి ఫోటోలు తీస్తుంటారు. ఫలితమే పైవిధమైన లోపాలు. అయితే ఈ లోపాలను ఇప్పుడు అధిగమించొచ్చు. ఎక్కువమందిని ఎలాంటి లోపాలు లేకుండా ఒకే ఫ్రేమ్‌లో బిగించేలా ఇల్లినాయిస్‌, నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీలలోని శాస్త్రవేత్తల బృందం ఒక కొత్త కెమెరాను తయారు చేశారు.

ఈగ కంటిని స్ఫూర్తిగా తీసుకుని వీరు 180 డిగ్రీల కోణంతో ఫోటో తీయగల కెమెరాను తయారు చేశారు. ఈ సరికొత్త అర్ధగోళాకారపు డిజిటల్‌ కెమెరాలో ఒకటి, రెండు కాదు ఏకంగా 180 సూక్ష్మ లెన్స్‌లు ఉంటాయట. ఇవన్నీ కలిసి అసాధారణమైన వైడ్‌ యాంగిల్‌ ఫోటోను చక్కగా తీస్తాయని ఈ పరిశోధన బృందంలోని సభ్యుడు యాంగాంగ్‌ హువాంగ్‌ అంటున్నారు. కాబట్టి ఎక్కువమందితో ఫోటో దిగాలనుకుంటే ఇక సమస్యేలేదుకదూ...!

More Telugu News