Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాత్రికి రాత్రే నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్... అంధకారంలో భాగ్యనగరి

హైదరాబాద్ నగరంలో గత అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయం కాగా, నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నిన్నటి వరకూ నీరు లేక బోసిపోయిన హుస్సేన్ సాగర్, తెల్లారేసరికి నిండుకుండలా కనిపిస్తోంది. నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా, పంజాగుట్ట, ఉప్పల్, అంబర్ పేట రోడ్ నంబర్ 6, తాజ్ కృష్ణా జంక్షన్, అమీర్ పేట ఇమేజ్ ఆసుపత్రి, కేసీపీ జంక్షన్, బేగంపేట న్యూవే, నింబోలి అడ్డా, చింతల్ బస్తీ గోల్నాక, పుత్లీబౌలీ, సీబీఎస్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఒకటిన్నర నుంచి రెండు అడుగుల ఎత్తున వర్షపు నీరు పారుతోంది.

 పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. హుస్సేన్ సాగర్ కు దారితీసే నాలాలన్నీ పొంగి పొరలుతున్నాయి. రోడ్లపై నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి.

More Telugu News