'బాహుబలి'ని కీర్తించడానికి నేనేమీ మందలో గొర్రెను కాను!: కమలహాసన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బాహుబలి'ని కీర్తించడానికి నేనేమీ మందలో గొర్రెను కాను!: కమలహాసన్

భారతీయ సినీ పరిశ్రమలో కమల హాసన్ కున్న స్థానం ప్రత్యేకం. ఆయన చేసినన్ని విభిన్నమైన సినిమాలు భారతీయ సినీ పరిశ్రమలో ఎవరూ చేసి ఉండరనడం అతిశయోక్తి కాదు. సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడైన కమల హాసన్ భారతీయ చిత్రపరిశ్రమలో అనితరసాధ్యమైన 1500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఏకైక సినిమా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను అభిమానులంతా ఆకాశానికెత్తగా, తెలుగు చిత్రపరిశ్రమ ఈ సినిమాను మించిన సినిమా లేదని పేర్కొంది.

ఈ నేపథ్యంలో కమలహాసన్ చెబుతూ... 'బాహుబలి' సినిమా మహాభారతానికి, తమిళ ఫాంటసీ టీవీ సిరీస్ 'అంబులి మామ'కు నకలు అని వ్యాఖ్యానించాడు. అంతేకాదు.. 'బాహుబలి' సినిమా తనపై ఎలాంటి ఒత్తిడి పెంచదని తేల్చిచెప్పాడు. గొర్రెలన్నీ ఒకదాని వెనుక ఒకటి వెళ్తాయని, మందతో కలిసి ముందుకు పోవడానికి తానేమీ గొర్రెను కానని ఆయన స్పష్టం చేశాడు. అంతే కాకుండా తాను కనీసం ఆ గొర్రెల మందను నడిపించే కాపరిని కూడా కాదని స్పష్టం చేశాడు. తాను వేరే జంతువునని, కొంత తేడా జంతువునని కూడా పేర్కొన్నాడు.

'మరుదనాయగం' సినిమా గురించి అభిమానులు తనపై ఒత్తిడి తెస్తున్నారని, అయితే తాను ఆ సినిమాను ఎప్పుడో పట్టాలెక్కించాలని భావించానని, అయితే 'మర్మయోగి' సినిమా మధ్యలో దూరి ఆ సినిమా ఆలోచనను మరింత వెనక్కి నెట్టిందని తెలిపాడు. సినీ పరిశ్రమలో అద్భుతమైన ఆలోచనలకు తలమానికమని చెప్పుకునేందుకు ఎవరూ లేరని, ఒకరిని చూసి మరొకరు స్పూర్తి పొందుతారని అన్నాడు. తాను కూడా ఏదైనా గొప్పగా చేయాలంటే మరొకరిని, లేదా మరొక సందర్భాన్ని చూసి స్పూర్తి పొందుతానని ఆయన స్పష్టం చేశారు. 

More Telugu News