నేను సీఎం అయితే, తొలి సంతకం ఆ ఫైలు పైనే!: స్టాలిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను సీఎం అయితే, తొలి సంతకం ఆ ఫైలు పైనే!: స్టాలిన్

డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్... తన దూకుడును ఏ మాత్రం తగ్గించడం లేదు. ముఖ్యమంత్రి పళనిస్వామి బల నిరూపణ చెల్లదంటూ కోర్టులో పిటిషన్ వేయడమేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టడంతో పాటు పలు సంచలన వ్యాఖ్యలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన్నార్ గుడి మాఫియా పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడటమే తన లక్ష్యమని ఆయన అన్నారు. జైలు నుంచి రిమోట్ ద్వారా పాలనను కొనసాగిస్తున్న శశికళ బినామీ ప్రభుత్వాన్ని తరిమికొడదామంటూ ఆయన పిలుపునిచ్చారు. అడ్డ దారిలో ముఖ్యమంత్రిని కావాలన్న ఆలోచన తనకు ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.

డీఎంకే అధికారంలోకి వచ్చి, తాను ముఖ్యమంత్రి అయితే... జయ మృతిపై విచారణ సంఘం ఏర్పాటు చేసే ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని స్టాలిన్ తెలిపారు. అన్నాదురై అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్పటి మంత్రి సాదిక్ బాషా ఎప్పటికప్పుడు సమాచారం అందించారని గుర్తు చేశారు. ఎంజీఆర్ అనారోగ్యం పాలైనప్పుడు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హండే ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె పరిస్థితి గురించిన సమాచారాన్ని అంత సీక్రెట్ గా ఎందుకుంచారని ప్రశ్నించారు. ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం కూడా పొంతన లేకుండా ఉందని విమర్శించారు. జయ మృతిపై విచారణ సంఘం ఏర్పాటు చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు.

More Telugu News