Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమీర్, షారుఖ్, సల్మాన్ లను ఇదే విధంగా ప్రశ్నించగలరా?: నిప్పులు చెరిగిన గౌతమ్ గంభీర్

'దంగల్' సినిమాలో నటించిన 16 ఏళ్ల జైరా వసీంకు టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీని కలడం పట్ల క్షమాపణలు చెప్పాలంటూ కశ్మీర్ యువత సోషల్ మీడియాలో డిమాండ్ చేయడంపై గంభీర్ ఫైర్ అయ్యాడు. జైరాతో బలవంతంగా క్షమాపణలు చెప్పించాలనుకోవడం అత్యంత అవమానకరమని విమర్శించాడు. ఇది పూర్తిగా లింగవివక్షతో కూడుకున్నదని ఆరోపించాడు.

'దంగల్' సినిమాలో నటించడం లేదా మెహబూబా ముఫ్తీతో కలవడం ఇస్లాంకు విరుద్ధమని చెప్పడం దారుణమని... ఆమెతో బలవంతంగా క్షమాపణలు చెప్పించడం సిగ్గుచేటని అన్నాడు. జైరాను అడిగినట్టే అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను అడగగలరా? అంటూ సవాల్ విసిరాడు. కేవలం అభద్రతా భావంతోనే జైరాపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడ్డాడు. ఒక బాలిక ఎదగడం చూసి ఓర్వలేకే ఈ విమర్శలు చేస్తున్నారని అన్నాడు.

గత 6 నెలలుగా కశ్మీర్ యువత చాలా దాడులను ఎదుర్కొంటున్నారని... ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రిని ఎలా కలుస్తావంటూ జైరాపై సోషల్ మీడియాలో అక్కడి యువత నానా యాగీ చేసింది. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే జైరాను విమర్శిస్తున్న వారిపై గంభీర్ మండిపడ్డాడు. మరోవైపు, జైరాకు రెజ్లర్లు గీతా ఫొగాట్, బబిత ఫొగాట్ లు కూడా అండగా నిలిచారు. జైరా వెనుక తాముంటామంటూ భరోసా ఇచ్చారు.
 

More Telugu News