Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సినిమా ప్రదర్శిస్తే 'సంతోష్ స్వప్న ధియేటర్'ను కాల్చేస్తా!: ఎమ్మెల్యే రాజాసింగ్

'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాను హైదరాబాదులోని సంతోష్ స్వప్న ధియేటర్ లో ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తన హెచ్చరికలు బేఖాతరు చేస్తూ సినిమాను ప్రదర్శిస్తే తాను కేజ్రీవాల్ లా ధర్నా చేసేవాడిని కాదని అన్నారు. పెట్రోల్ తీసుకెళ్లి ధియేటర్ ను కాల్చేస్తానని అన్నారు. తన నియోజకవర్గంలో పాకిస్థాన్ నటుడి సినిమాను ప్రదర్శించడాన్ని తాను అంగీకరించనని అన్నారు. అందుకే గోషామహల్ లో ఉన్న సంతోష్ స్వప్న ధియేటర్ ను హెచ్చరించానని ఆయన తెలిపారు. కరణ్ జొహార్ కు ఈ సినిమా విడుదల కాకపోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు. అలా కాకుండా ఈ సినిమా విడుదలై విజయం సాధిస్తే, కరణ్ జొహార్ ఇచ్చిన రెమ్యూనరేషన్ తో ఫవాద్ ఖాన్ పాకిస్థాన్ లో ట్యాక్సులు కడతాడని, అది గవర్నమెంట్ కి చేరి, దానిని వారు ఐఎస్ఐకి ఇస్తారని, వాళ్లు బాంబులు, తుపాకులు తయారుచేసి తీవ్రవాదులకు ఇస్తారని, వాళ్లు వాటితో భారతీయ సైనికులను హతమార్చుతారని అన్నారు. అంటే మన డబ్బుతో మనల్నే అంతం చేస్తారని ఆయన చెప్పారు. అలా జరగకూడదనే తన ప్రయత్నం తాను చేస్తున్నానని ఆయన తెలిపారు. అలాగే దీపావళికి చైనా టపాసులు కొనుగోలు చేయవద్దని ఆయన సూచించారు. చైనా టపాసులు కొనుగోలు చేయడం ద్వారా బాగా సంపాదించిన చైనా, ఆ డబ్బును భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ లో కారిడార్లు కట్టేందుకు, పాక్ తీవ్రవాదులకు సాయం చేసేందుకు వినియోగిస్తోందని, దీనిని అర్థం చేసుకుని ప్రజలంతా చైనా టపాసులు కొనుగోలు చేయడం మానేయాలని ఆయన సూచించారు.

More Telugu News