పాతబస్తీలో మా బలం పెరిగింది.. ఎన్నికల్లో విపక్షాలకు 7 సీట్లే!: తేల్చి చెప్పిన కేసీఆర్
ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే విపక్షాలకు ఏడెనిమిది సీట్లకు మించి రావని తమ సర్వేలో తేలిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పాతబస్తీలోనూ తామ పుంజుకున్నామని పేర్కొన్నారు. మజ్లిస్‌కు తమకు మధ్య 4-5 శాతం ఓట్ల తేడానే ఉందన్నారు. విజయదశమి సందర్భంగా సిద్ధిపేట జిల్లా, ముర్కుక్ మండలాన్ని ప్రారంభించిన తర్వాత ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న కేసీఆర్ మైనారిటీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. తెలంగాణలో గంగాజమున తెహ్జీబ్ను దెబ్బతీసే శక్తులకు చోటు లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో వారికి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశమే లేదన్నారు. ప్రజలంతా వందశాతం సంతోషంగా ఉన్నట్టు తాము నిర్వహించిన సర్వేలో తేలిందని కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తెలంగాణలో ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. అన్ని పాలక మండళ్లలో మైనారిటీలకు రెండుమూడు డైరెక్టర్ పోస్టులు ఇస్తామని, నిరుపేద ముస్లింలకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 50 వేల మందికి రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. మజ్లిస్ తమకు ఫ్రెండ్లీ పార్టీ అని, పాతబస్తీలో పనిచేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీని కోరుతామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మజ్లిస్ తమకు అండగా నిలిచిందని సీఎం గుర్తు చేశారు.