Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గులాబీలిచ్చి వైసీపీ నేత పార్థసారధి గాంధీగిరి!... ఎత్తేసి జీపులో కూర్చోబెట్టిన పోలీసులు!

ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన వైసీపీ నేతలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వివిధ రూపాల్లో నిరసనకు దిగారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆ పార్టీ కీలక నేతలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు అరెస్ట్ కాగా.. మిగిలిన ప్రాంతాల్లో ఆ పార్టీకి చెందిన నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పార్థసారధి వినూత్న నిరసనకు దిగారు. కార్యకర్తలతో కలిసి కొద్దిసేపటి క్రితం రోడ్డెక్కిన పార్థసారధి తమను అడ్డుకునేందుకు అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసు అధికారులకు గాంధీగిరి తరహాలో నిరసనను తెలిపారు. చేతిలో గులాబీ పూలతో రోడ్డెక్కిన పార్థసారధి వాటిని పోలీసు అధికారుల చేతిలో పెట్టారు. పార్థసారధి చేతి నుంచి పూలు అందుకున్న పోలీసులు... ఆయనను అరెస్ట్ చేశారు. పార్థసారధి గాంధీగిరీ తరహా నిరసన తెలిపినా... పోలీసులు మాత్రం తమదైన శైలిలో ఆయనను ఎత్తేసి జీపులో కూర్చోబెట్టారు.

More Telugu News