మద్రాస్ ఐఐటీలో ఆత్మహత్యల కలకలం!... ఒకే రోజు ఇద్దరు మహిళల సూసైడ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మద్రాస్ ఐఐటీలో ఆత్మహత్యల కలకలం!... ఒకే రోజు ఇద్దరు మహిళల సూసైడ్!

తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రతిష్ఠాత్మక మద్రాస్ ఐఐటీలో నిన్న ఆత్మహత్యల కలకలం రేగింది. ఒకే రోజు వర్సిటీ ప్రాంగణంలో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఒకరు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ భార్య కాగా, మరొకరు వర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ కోర్సు చేస్తున్న పరిశోధక విద్యార్థిని కావడం గమనార్హం. వర్సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో గంటల వ్యవధిలో వెలుగుచూసిన ఈ రెండు ఘటనలు అక్కడ భయానక వాతావరణానికి తెర తీశాయి. వివరాల్లోకెళితే... వర్సిటీకి చెందిన భౌతిక శాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న గణేశన్ సతీమణి విజయలక్ష్మీ (47) వర్సిటీలోని వారి క్వార్టర్ లో ఉరేసుకుని విగత జీవిగా కనిపించింది. ఈ ఘటనతో గణేశన్ కుటుంబ తీవ్ర విచారంలో మునిగిపోగా... వర్సిటీలో విషాదకర వాతావరణం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగానే ఈ ఘటన వెలుగుచూసిన కొద్ది గంటల్లోనే పోస్ట్ డాక్టోరల్ కోర్సు చేస్తున్న మహేశ్వరి (34) అనే మహిళ కూడా తానుంటున్న హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయింది. వరుసగా ఒకే రోజు ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలతో వర్సిటీ వణికిపోయింది. ఈ హత్యలకు కారణం తెలియరాకున్నా... గంటల వ్యవధిలో ఇద్దరూ ఒకే రీతిన ఆత్మహత్యకు పాల్పడటంతో అక్కడ కలకలం రేగింది. పెళ్లైన మహేశ్వరికి ఆరేళ్ల కొడుకున్నా... వర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ కోర్సు చేస్తోంది. ఈ ఆత్మహత్యల వెనుక ఉన్న కారణాలను వెలికి తీసేందుకు కొట్టూర్ పురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

More Telugu News