గోల్కొండ, శంషాబాదు పరిధిలో కార్డాన్ అండ్ సెర్చ్!.... ‘ఉగ్ర’భయాలతో ముమ్మర సోదాలు!
భాగ్యనగరి హైదరాబాదును ‘ఉగ్ర’భయాలు వీడటం లేదు. పక్షం క్రితం ఐదుగురు, నిన్న ఇద్దరు ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టైన నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేశారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 400 మంది పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ తరహా సోదాలు చేశారు.
ఆ ప్రాంతంలోని ఇంటింటిని జల్లెడ పట్టిన పోలీసులు సరైన డాక్యుమెంట్లు లేకుండానే నివాసం ఉంటున్న 9 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హైదరాబాదు శివారు ప్రాంతం శంషాబాదు పరిధిలోని నవాబ్ సాబ్ కుంట, తీగలకుంట పరిధిలోనూ శంషాబాదు డీసీపీ ఆధ్వర్యంలో కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు జరిగాయి. 170 మంది పోలీసులతో ఈ సోదాలు జరిగాయి. రాత్రి పొద్దుపోయిన తర్వాత వందల మంది పోలీసులు తమ ఇళ్లను చుట్టుముట్టిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.