నాపై ఆరోపణలు చేయడం కాదు.. వాటిని రుజువు చేయండి: నారా లోకేశ్ సవాల్
‘నాపై ఆరోపణలు చేయడం కాదు.. వాటిని రుజువు చేయండి’ అంటూ తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ సవాలు విసిరారు. విజయవాడ పంజా సెంటర్లో ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంజాన్ తోఫా అందించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు తనపై ఎన్నో ఆరోపణలు గుప్పిస్తూ టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. కులాల పేరుతో చిచ్చు పెడుతున్నాయన్నారు. కావాలని కాపు సోదరుల సభలో ట్రైనుని తగులబెట్టారని ఆయన ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.
ముస్లిం సోదరుల సంక్షేమంపై టీడీపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని లోకేశ్ అన్నారు. ముస్లిం సోదరుల అభివృద్ధికి 400 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని ఆయన వ్యాఖ్యానించారు. ‘మన చుట్టూ ఉన్న రాష్ట్రాలకు మిగులు బడ్జెట్ ఉంది.. కానీ ఏ రాష్ట్రంలోనైనా ఇంతగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం లేదు’ అని ఆయన అన్నారు. టీడీపీ ఒక పద్ధతి ప్రకారం పాలన అందిస్తోందని ఆయన అన్నారు.