బోర్డు పెట్టడానికి వీల్లేదన్న భవన యజమాని!... వాయిదాపడ్డ అరణ్య భవన్ ప్రారంభోత్సవం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బోర్డు పెట్టడానికి వీల్లేదన్న భవన యజమాని!... వాయిదాపడ్డ అరణ్య భవన్ ప్రారంభోత్సవం!

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నుంచే పాలన సాగిద్దామన్న ఏపీ సర్కారు దృఢ సంకల్పానికి నిన్న ఓ బ్రేక్ పడింది. ఈ నెల 27లోగా అన్ని శాఖలు అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరులకు తరలిరావాల్సిందేనన్న ఏపీ సర్కారు ఆదేశాలతో ఆయా ప్రభుత్వ శాఖలు అమరావతి బాట పట్టేశాయి. సచివాలయ ఉద్యోగులు మినహా, డైరెక్టరేట్లు, కమిషనరేట్లు తమ తమ కార్యాలయాల కోసం ప్రైవేట్ భవనాలను వెతుక్కున్నాయి. ఈ క్రమంలో ఆయా భవనాలను నిబంధనల మేరకు అద్దెకు తీసుకున్న ఆయా శాఖలు పూజలు చేశాయి. కార్యాలయాలను ప్రారంభించుకున్నాయి. అయితే నిన్న తన కార్యాలయాన్ని ప్రారంభించుకునేందుకు వెళ్లిన అటవీ శాఖాధికారులకు మాత్రం షాక్ తగిలింది. అరణ్య భవన్ పేరిట అటవీ శాఖ కార్యాలయం కోసం ఉండవల్లి ప్రాంతంలోని ఎస్వీఆర్ టవర్స్ ను అధికారులు అద్దెకు తీసుకున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే సదరు భవనానికి బోర్డు తగిలించే విషయంలో యజమాని ససేమిరా అన్నారు. అంతేకాకుండా ఆ యజమాని మరికొన్ని షరతులు పెట్టాడట. దీంతో షాక్ తిన్న పీసీసీఎఫ్ ఎస్బీఎల్ మిశ్రా, తన సిబ్బందితో కలిసి వెనుదిరగక తప్పలేదు. యజమాని అభ్యంతరాలతో అప్పటికే భవనాన్ని అద్దెకు తీసుకున్నా, అరణ్య భవన్ మాత్రం నిన్న ఓపెన్ కాలేదు.

More Telugu News