చిన్నారి జ్ఞానసాయి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ విషయంలో ప్రభుత్వం ఆదుకుంటుంది: కామినేని
అరుదైన కాలేయవ్యాధితో బాధపడుతోన్న తమ ఎనిమిది నెలల చిన్నారి జ్ఞానసాయికి వైద్యం చేయించే ఆర్థిక స్తోమత తమకు లేదని, తమ కూతురు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ తంబళ్లపల్లి న్యాయస్థానాన్ని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ఈరోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. చిన్నారి జ్ఞానసాయి వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. పాపకు సంబంధించిన వైద్య సర్టిఫికెట్లను తమ వద్దకు తీసుకుని రావాలని ఆయన చెప్పారు. జ్ఞానసాయి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారు.