ఖరీదైన నగరాల్లో ముంబై టాప్.. కోల్‌కతా లాస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఖరీదైన నగరాల్లో ముంబై టాప్.. కోల్‌కతా లాస్ట్

దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబై మొదటి స్థానంలో నిలవగా కోల్‌కతా చివరి స్థానంలో నిలిచింది. అత్యంత తక్కువ ఖర్చుతో కూడా బతుకుబండిని ఇక్కడ లాగించేయవచ్చని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. మరోరకంగా చెప్పాలంటే వలసదారులకు కోల్‌కతా స్వర్గధామం అని పేర్కొంది. ముంబై తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, చెన్నై నగరాలు ఉన్నాయి. గ్లోబల్ హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ నిర్వహించిన వార్షిక సర్వే నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. కోల్‌కతా దేశంలో అత్యంత చవకైన నగరమైనా విదేశీయులను మాత్రం బెంగళూరు విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక మెర్సర్స్ 2016 నివేదిక ప్రకారం వలసదారుల జేబులు గుల్లచేసే(అత్యధిక జీవన వ్యయం) నగరాల్లో హాంకాంగ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అంగోలా రాజధాని లౌండా, జ్యూరిచ్, సింగపూర్ నిలిచాయి. గతేడాది ఆరో స్థానంలో ఉన్న టోక్యో ఈసారి ఐదో స్థానానికి ఎగబాకగా కాంగో రాజధాని కిన్షానా ఆరో స్థానంలో నిలిచి మొదటిసారి టాప్ టెన్‌లో చోటు సంపాదించుకుంది. మనదేశంలోకి వస్తే ముంబై 82వ స్థానంలోనూ, ఢిల్లీ 130, చెన్నై 158, బెంగళూరు 180 స్థానాల్లోనూ నిలిచాయి. కోల్‌కతా 194వ స్థానంలో నిలిచి దేశంలో అతి చవకైన, తక్కువ వ్యయంతో జీవితాన్ని నెట్టుకొచ్చే నగరాల సరసన నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సియాటెల్(83) కంటే ముంబై(82) ఎగువన నుండడం గమనార్హం. ఫ్రాంక్‌ఫర్ట్(88), కాన్‌బెర్రా(98), బెర్లిన్(100), ఇస్తాంబుల్(101) స్థానాల్లో ఉన్నాయి. జీవనవ్యయం, ఖరీదైన నగరాలపై అధ్యయనం కోసం ప్రతీ ఏడాది మార్చిలో వివరాలు సేకరించి మే-జూన్ మధ్య జాబితాను విడుదల చేస్తారు.

More Telugu News