ఎస్పీ గారు వేధింపులకు గురి చేశారు... మహిళా కమిషన్ కు కన్నడ మాజీ డీఎస్పీ ఫిర్యాదు
కన్నడ నాట డీఎస్పీ పోస్టుకు రాజీనామా చేసి కలకలం రేపిన అనుపమా షెనాయ్ తాజాగా మహిళా కమిషన్ ను ఆశ్రయించి మరో పెను తుపానుకు తెర తీశారు. తనపై బళ్లారి ఎస్పీ వేధింపుల పర్వం కొనసాగించారని ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆర్.చేతన్ వేధింపులే తన రాజీనామాకు దారి తీశాయని ఆమె సదరు ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా ఎస్పీ స్థాయి అధికారి మానసిక క్షోభకు గురి చేస్తే... తనకు అండగా నిలవాల్సిన కింది స్థాయి సిబ్బంది సహాయ నిరాకరణ చేశారని ఆమె వాపోయారు.
ఈ నెల 4వ తేదీన రాసినట్లు భావిస్తున్న సదరు లేఖను అనుపమ బంధువులు ఇటీవలే మహిళా కమిషన్ కు అందజేశారు. 19 రోజుల పాటు తాను సెలవుపై వెళ్లగా, అదే అదనుగా తన కార్యాలయంలోకి వచ్చిన ఎస్పీ కీలక ఫైళ్లను తీసేసుకున్నారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా తాను సెలవు కోసం దరఖాస్తు చేస్తే... తన ఆరోగ్యంపై పరీక్షలు చేయాలని ఎస్పీ వైద్యులకు ఆదేశాలు జారీ చేశారని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఎష్పీ చేతన్... తాను నిబంధనల మేరకే వ్యవహరించానని పేర్కొన్నారు.