కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహానికి చేరుకున్నారు. తుని విధ్వంసకారుల పేరిట అరెస్ట్ చేసిన కాపులను విడుదల చేయడంతో పాటు కాపులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలోని తన సొంతింటిలోనే ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడను పోలీసులు బలవంతంగా రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఆసుపత్రిలోనూ దీక్ష విరమణకు ససేమిరా అన్న ముద్రగడ.. అరెస్టైన కాపులంతా బెయిల్ పై విడుదల కావడంతో నేటి ఉదయం దీక్ష విరమణకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో దీక్ష విరమణ దిశగా ఆయన చేసిన డిమాండ్లకు ప్రభుత్వం ససేమిరా అంది. దీంతో తన సతీమణితో కలసి సొంత కారెక్కిన ముద్రగడ కొద్దిసేపటి క్రితం కిర్లంపూడి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాపు నేతలు పెద్దఎత్తున కిర్లంపూడి చేరుకున్నారు. మరికాసేపట్లో ముద్రగడ దీక్షను విరమించనున్నట్లు సమాచారం.