మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు మద్దతుగా నిలుస్తానని టీడీపీ నేత రేవంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు రెండు రోజుల నిరాహార దీక్షకు సిద్ధమని ప్రకటించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మంత్రి హరీష్ రావు మల్లన్నసాగర్ బాధిత గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాధిత గ్రామాల ప్రజలకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని ఆయన సూచించారు. అలాగే ఈ 12 గ్రామాల ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇంత వరకు చెబుతున్నట్టు మల్లన్నసాగర్ నిర్వాసితులకు 123 జీవో ప్రకారం నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వం భావించడం సరికాదని స్పష్టం చేసిన ఆయన, మల్లన్నసాగర్ నిర్వాసితులకు మద్దతుగా ఏటిగడ్డ కిష్టాపూర్ లో ఈ నెల 25, 26 తేదీల్లో 48 గంటల పాటు నిరాహార దీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు.