ఉద్యోగుల తరలింపు నామమాత్రమే; అత్యధికులు హైదరాబాద్ లోనే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉద్యోగుల తరలింపు నామమాత్రమే; అత్యధికులు హైదరాబాద్ లోనే!

వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి కాకపోవడం, గుంటూరు, విజయవాడల్లో వివిధ శాఖలు అద్దెకు తీసుకుంటున్న భవనాల్లో మరమ్మతులు చేసేందుకు మరింత సమయం పట్టనున్న నేపథ్యంలో ఈ నెలాఖరుకు ఉద్యోగులు నామమాత్రంగానే తరలి వెళ్తారని, అత్యధికులు హైదరాబాద్ లోనే ఉండి విధులు నిర్వహిస్తారని తెలుస్తోంది. ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా, నెలాఖరుకు అందరి తరలింపు అసాధ్యమని, కనీసం మరో నెలన్నర రోజులైనా సమయం పడుతుందని పలు విభాగాల ఉన్నతాధికారులు చెబుతున్నారు. అమరావతికి అటూ ఇటూ ఉన్న గుంటూరు, విజయవాడల్లో భవనాలను అద్దెలకు తీసుకుంటున్నామని, వీటిని కార్యాలయాల నిర్వహణకు అనుకూలంగా మార్చేందుకు ఆరు వారాల సమయం పట్టవచ్చని అధికారులు అంటున్నారు. ఇక విభజన చట్టంలో పేర్కొన్న సంస్థల ఆస్తుల విభజన పూర్తికాకపోగా, ఆ సంగతి తేలే వరకూ హైదరాబాద్ ను వీడితే ఇబ్బందులు ఏర్పడవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి విభాగాల డైరెక్టర్లు, కమిషనర్లు వెళితే సరిపోతుందని, ఏర్పాట్లన్నీ పూర్తయిన తరువాత ఉద్యోగులను దశలవారీగా తరలిస్తామని ఉద్యోగ సంఘాలతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన వెల్లడించారు.

More Telugu News