ఎన్నికల కమిషన్ నిబంధనలను మీరి, గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రూ. 11.5 కోట్లు ఖర్చు చేశానని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ చానల్ ఇంటర్వ్యూలో చెప్పగా, దాని ఆదారంగా 'సాక్షి' దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 1983లో ఎన్నికల ఖర్చు కేవలం రూ. 30 వేలు మాత్రమేనని, ఇప్పుడది వేల రెట్లు పెరిగిందని ఆయన అన్నారు. ఎంతో మంది ఆస్తులను అమ్మేసి మరీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వివరించారు. ఈ పద్ధతి మంచిది కాదని చెప్పారు. కాగా, వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం, ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థి రూ. 28 లక్షలు మాత్రమే ఖర్చు చేయవచ్చు. ఇక ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ రూ. 5.3 కోట్లని ప్రకటించిన కోడెల, పదకొండు కోట్లకు పైగా ఎక్కడి నుంచి తెచ్చారన్న విషయమై, ఈసీ సుమోటో కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.