పొరుగు దేశం పాకిస్థాన్ తో చర్చలు నిలిచిపోయిన వైనంపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న ఢిల్లీలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా సుష్మా చేసిన వ్యాఖ్యలు ఉగ్రవాదం పట్ల భారత్ వ్యవహరిస్తున్న వైఖరిని సుస్పష్టం చేశాయి. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై పాక్ కు చెందిన ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డ విషయాన్ని ప్రస్తావించిన సుష్మా... ఆ ఘటనపై పాక్ తన దర్యాప్తును ముమ్మరం చేయాల్సి ఉందని చెప్పారు.
అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తునకు భారత బృందం పాక్ లో అడుగుపెట్టేందుకు కూడా ఆ దేశం అంగీకరించాల్సి ఉందని కూడా ఆమె చెప్పారు. పాక్ తో చర్చల ప్రక్రియ నిలిచిపోలేదని చెప్పిన సుష్మా... దర్యాప్తు దిశగా పాక్ ముందగుడు వేయాల్సి ఉందన్నారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవన్న విషయాన్ని పాక్ గ్రహించిన నాడు ఇరుదేశాల మధ్య చర్చల్లో పురోగతి సాధ్యమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.