న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లో సభ్యత్వం ఆశిస్తున్న తమకు మద్దతివ్వాలని కోరుతూ, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్ చైనా పర్యటన చేసొచ్చారు. ఆద్యంతం రహస్యంగా సాగిన ఈ పర్యటన విషయం ఆయన చైనా వెళ్లొచ్చిన తరువాత బయటకు పొక్కింది. 16, 17 తేదీల్లో జై శంకర్ చైనా వెళ్లి వచ్చారని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ నేడు వెల్లడించారు. "అవును. విదేశాంగ శాఖ కార్యదర్శి ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత కోసం చైనా వెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరిపి వచ్చారు. ఎన్ఎస్జీ సభ్యత్వంపైనా ఆయన మాట్లాడారు" అని వికాస్ వెల్లడించారు. కాగా, ఎన్ఎస్జీ భారత సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు భారత్ కు మద్దతిస్తుండగా, చైనా మాత్రం దక్షిణాసియాలో అణ్వస్త్ర పోటీ పెరుగుతుందని ఆరోపిస్తూ, మోకాలొడ్డాలని యత్నిస్తోంది.