జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ మరోసారి రణరంగంగా మారింది. ఆర్మీ కాలనీకి వ్యతిరేకంగా యాసిన్ మాలిక్ ఆధ్వర్యంలోని వేర్పాటు వాదులు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఆర్మీ కాలనీ ఏర్పాటు చేయాలని తద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, సైనికులకు ప్రత్యేక కాలనీలు కట్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా సాధారణ ప్రజానీకం నుంచి ఉద్యోగులను వేరు చేసి నిరంతర నిఘాలో ఉంచనుంది. దీంతో ఒక వర్గం వేరైపోతే, ఉద్యోగులకు సంక్షేమ ఫలాలు అందుతాయని, అలా జరగడం ద్వారా సాధారణ ప్రజానీకాన్ని గుప్పెట్లో ఉంచుకోవడం ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదని, తద్వారా వేర్పాటు వాదులు, తిరుగుబాటుదారులు, తీవ్రవాదులను ఏరివేయడం సులభమని, ఇలా జరిగితే ప్రజలపై తమ పట్టు సడలిపోతుందని భావించిన వేర్పాటు వాదులు ప్రజల్లో విద్వేషాలు రేపుతున్నారు. దీంతో ఆ కాలనీలు నిర్మించవద్దంటూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు భారత్ పై వ్యతిరేకతను ప్రదర్శిస్తూ పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేస్తూ, ఆ దేశ జెండా, ఐఎస్ఐఎస్ జెండాలు ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా వారు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో, పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.