వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి... పారిశ్రామికవేత్తల ఖిల్లా నెల్లూరులో పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్. వీపీఆర్ గా అందరికీ చిరపరచితమైన ప్రభాకర్ రెడ్డి మొన్నటిదాకా నెల్లూరు జిల్లాలో వైసీపీకి కీలక నేత. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి వారి గెలుపునకు అవసరమయ్యే నిధులను సమకూర్చే బాధ్యత కూడా ఆయనదే. తన సామాజిక వర్గానికే చెందిన వీపీఆర్ కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రాధాన్యమే ఇచ్చారు.
అయితే కొన్నాళ్ల క్రితం ఏమైందో తెలియదు కాని... వీపీఆర్ వైసీపీకి రాజీనామా చేశారు. నేరుగా విజయవాడ వెళ్లి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కలిశారు. పార్టీలో చేరతానంటూ వచ్చిన ఆయనను చంద్రబాబు కూడా స్వాగతించారు. అయితే ఇప్పటిదాకా వీపీఆర్ టీడీపీలో చేరలేదు. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటూ వీపీఆర్ చేసిన ప్రతిపాదనకు తొలుత సరేనన్నా... ఆ తర్వాత చంద్రబాబు వద్దన్నారు. ఈ క్రమంలో వీపీఆర్ తిరిగి వైసీపీ వైపు మొగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నింటినీ పటాపంచలు చేస్తూ వీపిఆర్ రేపు నెల్లూరు వస్తున్న చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.