నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తోన్న వేళ తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్పందించారు. ఓ టీవీ చాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. వర్షాలు లేక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన మాట వాస్తవమ‌ని అన్నారు. కందిపప్పు వంటి నిత్యావసర సరుకుల బ్లాక్ మార్కెటింగ్ కొన్ని చోట్ల జ‌రుగుతోంద‌న్నారు. ఇలా బ్లాక్ మార్కెట్ అయిన సరుకులను పట్టుకుని వెన‌క్కి తెప్పిస్తున్నామ‌న్నారు. త్వ‌ర‌లోనే కందిప‌ప్పును రూ.110- 120 ధరలో ప్ర‌జ‌ల‌కందేలా అందుబాటులో ఉంచుతామ‌న్నారు. కొన్ని నిత్యావ‌స‌ర ధ‌ర‌ల నియంత్ర‌ణ ప్ర‌భుత్వ అదుపులో ఉండ‌డం లేద‌ని ఈటల పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ‌మే కొన్ని సరుకులు కొని స‌బ్సిడీపై స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ఇత‌ర శాఖల స‌మ‌న్వ‌యంతో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌ను నియంత్రిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.