ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం సరికొత్త అవతారం ఎత్తారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘విద్యాంజలి’ కార్యక్రమంలో భాగంగా నేటి ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఆత్కూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లిన చంద్రబాబు... అక్కడి ఓ తరగతి గదిలోకి వెళ్లి ఉపాధ్యాయుుడు కూర్చుండే సీటులో కూర్చున్నారు. కళ్లద్దాలు పెట్టుకుని ‘చంద్రం మాస్టారు’లా ఆయన మారిపోయారు. అక్కడి విద్యార్థుల వద్ద ఉన్న ఓ పుస్తకాన్ని తీసుకుని అందులోని ‘దురాశ దు:ఖానికి చేటు’ అనే నీతి కథను సాంతం చదివారు. ఈ కథను సాంతం చదువుతూనే మధ్య మధ్యలో దానిని విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఇక పాఠం చెప్పడం అయిపోయిన తర్వాత ఆ నీతి కథ ద్వారా ఏమి బోధపడిందని ఆయన విద్యార్థులను ప్రశ్నించారు. తొలుత విద్యార్థులు కాస్తంత బెరుకుగా నోరు మెదపకున్నా... చంద్రబాబు చొరవతో ఆ తర్వాత వేగంగా సమాధానాలు చెప్పారు. విద్యార్థుల నుంచి పూర్తి స్థాయిలో సమాధానాలు రాబట్టిన తర్వాత గాని చంద్రబాబు అక్కడి నుంచి కదలలేదు. ఈ మొత్తం వ్యవహరాన్ని చంద్రబాబు పక్కనే కూర్చున్న ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తిగా పరిశీలించారు.