ఎన్నికలప్పుడు చంద్రబాబు, ఇప్పుడు జగన్ కాపులను మోసం చేస్తున్నారు: సీపీఐ రామకృష్ణ
రెండేళ్ల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులను మోసం చేశారని సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, మళ్లీ కాపుల ఓట్ల కోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఇప్పుడు వారిని మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రాజకీయాల కోసం ఈ ఇద్దరూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే వీరిద్దరూ కులాలను రెచ్చగొడుతున్నారని ఆయన తెలిపారు.
మధ్యలో చిరంజీవికి ఏం పోయేకాలం వచ్చిందో తెలియదు కానీ, గతంలో ఎన్నడూ కాపు సంక్షేమం కోసం మాట్లాడని చిరంజీవి ఇప్పుడు కొత్తగా కాపు ఉద్యమమని అంటున్నాడని ఆయన మండిపడ్డారు. ప్రజలు విచక్షణతో ఆలోచించాలని ఆయన సూచించారు. ముద్రగడ కూడా హడావుడిగా దీక్ష చేయడం సరైన నిర్ణయమో కాదో ఆలోచించాలని ఆయన సలహా ఇచ్చారు.