ఫ్రూటీ తాగిన చిన్నారుల పరిస్థితి విషమం... పాతబస్తీలో కలకలం
సరదాగా కూల్ డ్రింక్ షాపు కెళ్లి ఫ్రూటీ కొనుక్కొచ్చి తాగిన ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురై, ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్, పాతబస్తీ పరిధిలోని కాపాపత్తర్ లో కలకలం సృష్టించింది. ఫ్రూటీ తాగిన చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లగా, వారిని ఫర్హా ఆసుపత్రిలో చేర్చారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వైద్యులు వెల్లడించగా, రంగంలోకి దిగిన పోలీసులు ఫ్రూటీ నమూనాలను సేకరించారు. దాన్ని సరఫరా చేసిన గోడౌన్లపై దాడులు జరిపి ఫ్రూటీ ప్యాకెట్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేశామని, ఈ నమూనాలను పరీక్షల నిమిత్తం పంపుతున్నామని తెలిపారు. ఫ్రూటీలో విషరసాయనాలు కలిసినందునే ఇలా జరిగిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు నిరసన చేపట్టారు.