సఫారీలు ఉతికేశారు...ఇంగ్లిష్ బౌలర్లు తేలిపోయారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సఫారీలు ఉతికేశారు...ఇంగ్లిష్ బౌలర్లు తేలిపోయారు!

2016 టీ20 వరల్డ్ కప్ ఇంగ్లిష్ ఆటగాళ్లకు కలిసివచ్చినట్టు కనిపించడం లేదు. ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్ లలో భారీ స్కోరు సమర్పించుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సఫారీలు బ్యాటింగ్ కు దిగారు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన సౌతాఫ్రికా ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు చూపించింది. డికాక్ (52), అమ్లా (52), డివిలియర్స్ (16), డుప్లెసిస్ (17), డుమిని (54), డేవిడ్ మిల్లర్ (28) ఇలా క్రీజులోకి దిగిన ప్రతి ఆటగాడు సిక్సర్లు ఫోర్లతో ముంబైలోని వాంఖడే స్టేడియంను హోరెత్తించాడు. ఇంగ్లిష్ బౌలర్లు యార్కర్, గుడ్ లెంగ్త్, షార్ట్ పిచ్, స్వింగర్, బౌన్సర్ ఇలా ఏ బంతిని సంధించినా దానిని సఫారీ బ్యాట్స్ మన్ గ్రౌండ్ ను దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి సౌతాఫ్రికా జట్టు 229 పరుగులు సాధించింది. 230 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆటగాళ్లు ఛేదించాల్సి ఉంది. కాగా, తొలి మ్యాచ్ లో ఇదే రీతిలో భారీ స్కోరు సమర్పించిన ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ కు మ్యాచ్ ను అప్పగించిన సంగతి తెలిసిందే.

More Telugu News