Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ప్రచారంతో లాభం పొందే కంటే, అండర్ వేర్ లు అమ్ముకుని బతుకుతా: సెన్సార్ బోర్డుపై హన్సాల్ మెహతా ఫైర్

సెన్సార్ బోర్డు చీఫ్ పహలాజ్ నిహలానీ, 'అలీగఢ్' చిత్ర దర్శకుడు హన్సాల్ మెహతాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శ్రీనివాస్ రామచంద్ర సిరాస్ జీవిత కథ ఆధారంగా తాను తెరకెక్కించిన 'అలీగఢ్' సినిమా ట్రయిలర్ కు A సర్టిఫికెట్ ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు విధించిన కట్స్ చూసి తాను ఆశ్చర్యపోయానని, వీటిని తాను అంగీకరించేది లేదని, ట్రైబ్యునల్ కు వెళతానని స్పష్టం చేశారు. తాను చీప్ పబ్లిసిటీ కోసం యత్నిస్తున్నానని నిహలానీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టిన ఆయన, ఆ తరహా ప్రచారం తనకు అక్కర్లేదని, దానికి బదులుగా దర్శకత్వాన్ని వీడి, అండర్ వేర్లు అమ్ముకుని జీవనం సాగిస్తానని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తాను నిజాయతీగా చిత్రాన్ని తెరకెక్కించానని తెలిపారు. సెన్సార్ షిప్ అంటే, సినిమాకు సర్టిఫికెట్ గా ఉండాలే తప్ప కటింగులు కాదని అన్నారు. చిత్రంలో పాత్రల స్వభావాలకు, జరిగిన విషయానికి అనుగుణంగానే చిత్రీకరణ జరిగిందన్నారు. కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలతో విధుల నుంచి తొలగించబడ్డ ప్రముఖ ప్రొఫెసర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

More Telugu News