థియేటర్లో ‘జన గణ మన’కు అవమానం... లేచి నిలబడని ఇద్దరు ముంబై యువతులపై కేసు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

థియేటర్లో ‘జన గణ మన’కు అవమానం... లేచి నిలబడని ఇద్దరు ముంబై యువతులపై కేసు

మరాఠీలకు మిగతా వారి కంటే కాస్తంత దేశ భక్తి ఎక్కువే. ఇందులో ఏ ఒక్కరికి కూడా అనుమానం అవసరం లేదు. ఎందుకంటే, మహారాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందే. థియేటర్ కు వెళ్లిన వారంతా జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలుచుని మరీ తమ దేశభక్తి చాటుకుంటారు. అయితే నిన్న ముంబైలోని అంధేరీ శివారుకు చెందిన ఇన్ ఫినిటీ మాల్ లోని ఓ హాల్ లో సినిమా చూసేందుకు సామాజిక ఉద్యమకర్త శీతల్ మాత్రే స్నేహితురాలు జ్యోతి భట్ తో కలిసి వెళ్లారు. సినిమా ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతం ఆలపిస్తుండగా, థియేటర్లోని వారంతా లేచి నిలబడగా, ఇద్దరు యువతులు మాత్రం కూర్చునే ఉన్నారట. దీనిని గమనించిన శీతల్ వారి వద్దకెళ్లి జాతీయ గీతాన్ని అవమానపరుస్తున్నారని గుర్తు చేశారట. లేచి నిలబడటం అటుంచి, తమనే తప్పుబడతావా? అంటూ శీతల్ పై సదరు యువతులు అంతెత్తున ఎగిరిపడ్డారు. తిట్ల దండకం అందుకోవడమే కాక అక్కడి నుంచి వెళ్లకపోతే తంతామని కూడా హెచ్చరించారు. దీంతో శీతల్ అంబోలి పోలీస్ స్టేషన్ లో సదరు యువతులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాతీయ గీతాన్ని అవమానపరిచారన్న యువతులను పిలిచి వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

More Telugu News