Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఊరూరా సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించండి: చంద్రబాబు

సంక్రాంతికి ఊరూరా ఉత్సవాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పలు అంశాలపై అధికారులతో బాబు సమీక్షించారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఈసారి కూడా పశువైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో సమూల సంస్కరణలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. పేదలకు అందుబాటులో అన్నిరకాల వైద్య సేవలు అందించడం కోసమే ఈ సంస్కరణలు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని జిల్లాల ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులలో జనవరి 1 నుంచి హెల్త్ చెకప్ ఉచిత సేవలను ప్రారంభిస్తున్నట్టు వైద్యశాఖ అధికారులు సీఎంకు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులను పంపిణీకి సిద్ధం చేసినట్టు చెప్పారు. బ్లడ్ టెస్టు దగ్గర నుంచి అన్ని రకాల టెస్టులను ప్రాథమిక ఆస్పత్రి నుంచి జిల్లా ఆస్పత్రి వరకు ఉచితంగా అందుబాటు లోకి తెస్తున్నట్టు తెలిపారు. ఫ్లోరైడ్ సమస్య వున్న 329 ప్రాంతాలలో జనవరి నాటికి మినరల్ వాటర్ సరఫరా చేయాలని సూచించారు. స్కూల్ డ్రాప్ అవుట్స్ పై పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్, నర్సరీల ఏర్పాటుకు గుర్తించిన పాఠశాలలు మొదలైన అంశాలపై సమీక్షించారు. కాగా, ఈనెల 30న కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.

More Telugu News