లాలూ నకిలీ యాదవ్... ఆర్జేడీ చీఫ్ పై పప్పూ యాదవ్ సంచలన వ్యాఖ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లాలూ నకిలీ యాదవ్... ఆర్జేడీ చీఫ్ పై పప్పూ యాదవ్ సంచలన వ్యాఖ్య

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పై ఆ రాష్ట్రానికి చెందిన మరో యాదవ నేత పప్పూ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ ను 'నకిలీ యాదవ్' అని పేర్కొన్న పప్పు యాదవ్ తానే నిజమైన యాదవుడనని ప్రకటించుకున్నారు. బీహార్ రాజకీయ నేతల్లో అత్యంత నేరపూరిత చరిత్ర కలిగిన పప్పూ యాదవ్ పూర్వాశ్రమంలో ఆర్జేడీ నేతగానే ఉన్నారు. అంతేకాక లాలూ ప్రసాద్ కు అత్యంత సన్నిహితుడిగానూ పేరుగాంచారు. తాజాగా లాలూతో విభేదించిన పప్పూ యాదవ్, ‘జన్ అధికార్ పార్టీ’ పేరిట సొంత కుంపటి పెట్టుకుని బీహార్ అసెంబ్లీ బరిలో దిగారు. మాధేపురా ఎంపీగా కొనసాగుతున్న పప్పూ యాదవ్, యాదవులు అత్యధికంగా ఉన్న సీమాంచల్ లో మెజారిటీ సీట్లు కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రచించారు. ఐదో విడతలో సీమాంచల్ లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో నిన్న ఆయన లాలూ ప్రసాద్ పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘‘లాలూ ప్రసాద్ తనచుట్టూ భజనపరులనే పెట్టుకుంటారు. ఒకప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉన్న యాదవ్ లను ఇప్పుడు పార్టీ నుంచి గెంటేశారు. యాదవ్ లను ఆయన ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. కానీ నేను మాత్రం యాదవ్ సామాజికవర్గం అభ్యున్నతికి కృషి చేస్తున్నాను’’ అని పప్పూ యాదవ్ తనదైన రీతిలో ప్రచారం సాగిస్తున్నారు.

More Telugu News