చైనా సైనికాధికారికి క్లాస్ పీకిన భారత అధికారి... రెండేళ్ల నాటి ఘటనకు చెందిన వీడియో హల్ చల్
"ఇదేమీ మీ ప్రాంతం కాదు. ఇది మా ఏరియా. మీరు ఇక్కడ ఇంతమందితో పెట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు? పది మంది చాలరా? ఇంత మంది ఎందుకు?" ఈశాన్య కాశ్మీర్ లోని లడఖ్ ప్రాంతానికి వచ్చిన చైనా సైన్యాన్ని చూసిన ఓ భారత ఆర్మీ అధికారి కోపంతో చేసిన వ్యాఖ్యలివి. దీనిపై స్పందించిన చైనా సైన్యాధికారి ఒకరు వచ్చీ రాని ఇంగ్లీషులో "సరిహద్దు స్పష్టంగా ఉంది" అనగా, "ఇది భారత భూభాగం. మీరు ఇండియాలో ఉన్నారు" అని గట్టిగానే అన్నాడు. వీరి మాటల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
దీన్ని దాదాపు రెండేళ్ల క్రితం తీసివుండవచ్చని ఆర్మీ చెబుతుండగా, చైనా, భారత్ ల మధ్య సరిహద్దుల్లో ఇటువంటి ఘటనలు సర్వసాధారణమేనని ఓ అధికారి వ్యాఖ్యానించారు. చైనా సైనికాధికారిని ఉద్దేశించి వేలెత్తి చూపుతూ "సరిహద్దులు నాకు స్పష్టంగా తెలుసు. నీకే తెలీనట్టుంది" అని భారత అధికారి అనడం కూడా ఈ వీడియోలో ఉంది. ఆ ప్రాంతం తమదంటే, తమదని ఇరు పక్షాలు కాసేపు వాదులాడుకున్నాయి. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.