Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ కూతురి దందా అది: మధుయాష్కీ ఘాటు విమర్శ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎంపీ కవితది వసూళ్ల దందా అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని కుటుంబాల్లో మహిళల పసుపుతాళ్లు తెగుతూ ఇబ్బందుల్లో ఉంటే, కవిత మాత్రం బతుకమ్మ ఆడుతూ ఊరూరా తిరుగుతోందని అన్నారు. పాలనలో భాగమైన కవిత రైతులను ఆదుకోకుండా, తన సంస్థ ద్వారా డబ్బులు సేకరించి రైతు కుటుంబాలకు పంచుతానని చెబుతోందని ఆయన విమర్శించారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వానికి చేతకాదని కవిత పరోక్షంగా చెబుతోందా? అని ఆయన అడిగారు. తెలంగాణ అమర వీరుల శవాలపై పేలాలు ఏరుకున్న కవిత, ఇప్పుడు రైతు ఆత్మహత్యలతో వసూళ్లకు పాల్పడుతోందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబం మొత్తం వసూళ్లకు పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ 110 ఎకరాల జాగీరు ఏర్పాటు చేసుకుంటే, కవిత లాక్మే షోరూంలు పెట్టుకుందని, హరీష్ రావు ఆంధ్రవాళ్లతో కలిసి ద్విచక్రవాహన వ్యాపారం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎదుట నిలబడి మాట్లాడలేని సన్నాసులా కాంగ్రెస్ మీద విమర్శలు చేసేది అంటూ ఆయన మండిపడ్డారు.

More Telugu News