Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధాని విదేశీ పర్యటన షురూ... ఢిల్లీ నుంచి ఐర్లాండ్ బయలుదేరిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రధాని ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరారు. అక్కడ స్వల్ప పర్యటన అనంతరం, రేపు అటు నుంచి అటే ఆయన అమెరికా బయలుదేరతారు. అక్కడ జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారు. అనంతరం సిలికాన్ వ్యాలీలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేయనున్న సమావేశానికి హాజరవుతారు. ఆ తర్వాత ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకెర్ బర్గ్ సహా అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఐర్లాండ్, అమెరికా పర్యటనలను ముగించుకుని మోదీ 29న తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. కాగా, గడచిన 60 ఏళ్ల కాలంలో ఐర్లాండ్ లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డులకెక్కనున్నారు.

More Telugu News