Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంగా స్పెషాలిటీ అదే: సచిన్

మరికొన్ని రోజుల్లో క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్న లంక బ్యాటింగ్ లెజెండ్ కుమార్ సంగక్కరకు మహామహులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ లంక క్రికెట్ స్టార్ గురించి భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓ క్రికెటర్ గా సంగక్కర ప్రస్థానం అద్భుతమని పేర్కొన్నారు. కెరీర్ తొలినాళ్లలో విధ్వంసకర బ్యాటింగ్ చేయకపోయినా, తర్వాత్తర్వాత బ్యాట్ ఝుళిపించడం ద్వారా పరుగులు వెల్లువెత్తించాడని తెలిపారు. "అనుభవం పెరిగేకొద్దీ వన్నె తేలాడు. ప్రపంచ స్థాయి క్రికెటర్ అనేందుకు అదే సూచిక. లంకేయులకే కాదు, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అతడు ఎందరో యువకులకు ఆదర్శప్రాయుడు. మామూలుగా, ఎడమచేతి వాటం ఆటగాళ్ల బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంటుంది. అయితే, నేను ప్రత్యర్థి జట్టులో ఉండడంతో సహజంగానే అతడి ఆటను ఆస్వాదించలేకపోయాను. సంగక్కరకు ప్రత్యర్థిగా ఆడడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఎప్పుడు లంకతో ఆడినా, అతడు డేంజర్ మ్యాన్ గా కనిపించేవాడు. సంగాలో ఓ ప్రత్యేకత ఉంది. అదే అతడిని ప్రమాదకరంగా మార్చిందనుకుంటా. క్రీజులో అసౌకర్యంగా కదులుతున్న సమయంలోనూ పరుగులు రాబట్టగల సామర్థ్యం అతడి సొంతం. అదే సంగా స్పెషాలిటీ. పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకోవడంలో దిట్ట" అని కితాబిచ్చారు.

More Telugu News