తెగిపోయిన చేతిని కాలికి అతికారు... చైనా వైద్యుల అద్భుతం!
చైనాలోని చాంగ్షా ఆసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. ఓ వ్యక్తి చేయి మణికట్టు వరకు తెగిపోగా, ఆ తెగిన భాగాన్ని కాలికి అతికారు. తెగిపోయిన మణికట్టు భాగంలోని నరాలు, కండర స్నాయువులు దెబ్బతినకుండా ఈ ఏర్పాటు చేశారు. నెల తర్వాత తిరిగి మణికట్టును యథాస్థితిలో అమర్చారు. ఈ నెల రోజుల వ్యవధిలో చేయి, మణికట్టు భాగాలకు చెందిన నరాలు, కండరపోగులు పూర్వపు స్థితిని సంతరించుకుని సర్జరీకి అనువుగా మారతాయని చాంగ్షా వైద్యులు భావించారు. వారి అంచనా ఫలించి... కాలికి అతికిన ఆ మణికట్టు కోలుకుంది.
ఓ కర్మాగారంలో పనిచేసే ఝౌ అనే కార్మికుడు విధుల్లో ఉండగా ప్రమాదానికి గురయ్యాడు. స్పిన్నింగ్ బ్లేడ్ లో చిక్కుకున్న అతడి ఎడమ చేయి మణికట్టు వరకు తెగిపోయింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, తెగిపోయిన మణికట్టు, చేయి కూడా తీవ్రంగా దెబ్బతినడంతో వాటిని వెంటనే అతికేందుకు సాధ్యం కాదని గుర్తించిన అక్కడి మైక్రోసర్జరీ విభాగం హెడ్ డాక్టర్ టాంగ్ జుయు రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2013లో ఇలాంటి కేసునే డీల్ చేసిన అనుభవంతో తెగిపోయిన భాగాన్ని కాలికి అతికారు. కుడి కాలి మడమ రక్తప్రసరణ వ్యవస్థతో తెగిపోయిన మణికట్టు భాగాన్ని అనుసంధానించారు. నెల తర్వాత 10 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి మణికట్టును పూర్వపు స్థానంలో అమర్చారు. దీనిపై డాక్టర్ టాంగ్ మాట్లాడుతూ... "ఓ అవయవానికి సుదీర్ఘ సమయం పాటు రక్త సరఫరా నిలిచిపోతే కండర కణజాలం మృతిచెందుతుంది, ఇక ఆ అవయవాన్ని కాపాడలేం. సాధారణ ఉష్ణోగ్రత వద్ద, ఓ వేలికి తీవ్ర గాయం అయితే పది గంటల్లోగా రక్త సరఫరా పునరుద్ధరించాల్సి ఉంటుంది. అదే, ఓ అవయవం తెగిపోయి శరీరం నుంచి వేరుపడినప్పుడు పునరుద్ధరణ సమయం మరింత తగ్గిపోతుంది" అని వివరించారు.