అర్ధరాత్రి గోదావరి తీరంలో చంద్రబాబు... పుష్కరాలపై ఏపీ సీఎం నిఘా!
పవిత్ర గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున జరిగిన దుర్ఘటన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని కంటి మీద కునుకు వేయనీయడం లేదు. ఘటన జరిగిన నాటి నుంచి పుష్కరాలు ముగిసేదాకా రాజమండ్రిలోనే బస చేస్తానని ప్రకటించిన చంద్రబాబు, చెప్పిన మాట మేరకు పనిచేసుకుపోతున్నారు. పుష్కరాల ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితరాలపై ఆయన నిఘా పెంచారు.
మొన్న ప్రమాదం జరిగిన రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత పుష్కర ఘాట్లలో ప్రత్యక్షమైన చంద్రబాబు, తాజాగా నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రాజమండ్రిలోని పుష్కర ఘాట్లను సందర్శించారు. ఆయా ఘాట్లలో ఏర్పాటైన వసతులు, తలెత్తుతున్న ఇబ్బందులపై ఆయన అధికారులతో సమీక్షించారు. అంతేకాక నిన్న గోదావరి పుష్కరాలకు భక్తుల రాక, వారికి వసతి సౌకర్యాలు, ఎదురైన ఇబ్బందులు తదితరాలపై ఆయన అధికారులను అడిగితెలుసుకున్నారు.