లేడీ డాక్టర్ కాలర్ ను సరిచేసిన జమ్మూ కాశ్మీర్ మంత్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లేడీ డాక్టర్ కాలర్ ను సరిచేసిన జమ్మూ కాశ్మీర్ మంత్రి

జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ తన చర్యతో వార్తల్లోకెక్కారు. అమర్ నాథ్ యాత్ర కోసం ఆసుపత్రుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారన్న విషయం పరిశీలించేందుకు ఆయన లఖన్ పూర్ లో ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఓ వైద్యురాలిని చూసిన ఆయన ఆమె కాలర్ సరిగా లేదన్న విషయం గుర్తించి, అదే విషయాన్ని ఆమెతో చెప్పారు. అంతటితో ఆగలేదా మంత్రివర్యుడు. తానే ఆ లేడీ డాక్టర్ కాలర్ సరిచేశారు. పాపం! ఆ వైద్యురాలు మంత్రి చర్యకు అభ్యంతరం చెప్పలేదట. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో లేడీ డాక్టర్ మంత్రి చర్యను గమనించి హడావుడిగా తన కాలర్ సరిచేసుకుందని ఓ అధికారి తెలిపారు. కాగా, మంత్రి చౌదరీ లాల్ సింగ్ చర్యను నెటిజన్లు తప్పుబట్టారు. ఓ మహిళను తాకడం సమంజసం కాదు అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరోగ్య మంత్రి తీరుపై ఓ మహిళా వైద్యురాలు అభ్యంతరం వ్యక్తం చేసింది. ల్యాబ్ కోటు ధరించలేదంటూ ఆయన ఆ లేడీ డాక్టర్ ను చీవాట్లు పెట్టారు. దాంతో, ఆమె మంత్రి తనను మానసిక వేధింపులకు గురిచేశారంటూ ఆరోపించింది.

More Telugu News