తల్లిదండ్రులు అంగీకరించారు...కులపెద్దలు చంపేస్తామంటున్నారు
ఉత్తర భారతంలోని గ్రామాల్లో కులపెద్దల ఆగడాలు మితిమీరుతున్నాయి. బీహార్ లోని కతిహార్ జిల్లాలోని ఓ గ్రామంలో కూడా అలాగే కులపెద్దలు ఓ ప్రేమజంటపై కన్నెర్ర చేశారు. కట్టుబాట్లు దాటారంటూ జరిమానా విధించారు. ఛోటూ యాదవ్, సోని దేవి ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో జిల్లా కేంద్రం కతిహార్ పారిపోయి వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు చంపేస్తారని భయపడి అక్కడే ఉన్నారు. ఆరు నెలల కాలం ముగిసేసరికి రెండు కుటుంబాల్లోని పెద్దలు వారి వివాహాన్ని అంగీకరించారు. దీంతో వారు స్వగ్రామం వచ్చేశారు. ఇక్కడే కులపెద్దలు రంగంలోకి దిగారు.
50 వేలు కట్టాలని అమ్మాయి కుల పెద్దలు తీర్పు ఇచ్చారు. లేని పక్షంలో తీవ్రపరిణామాలు చూడాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. చంపేసినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలిపారు. దీంతో భీతిల్లిన ఛోటూయాదవ్, తమది పేద కుటుంబమని, 50 వేలు చెల్లించలేమని, గ్రామ పెద్దలనుంచి ప్రమాదం ఉందని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఛోటూ యాదవ్ చెప్పింది నిజమని తేలితే, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.