‘మహా’ పురపాలికల్లో మజ్లిస్ సత్తా... బరిలోకి దిగిన తొలిసారే 25 వార్డుల్లో విజయభేరీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘మహా’ పురపాలికల్లో మజ్లిస్ సత్తా... బరిలోకి దిగిన తొలిసారే 25 వార్డుల్లో విజయభేరీ!

హైదరాబాదు పాతబస్తీ పార్టీగా పేరుగాంచిన మజ్లిస్ పార్టీ నగరంలోనే కాదండోయ్, రాష్ట్ర సరిహద్దులు దాటి సత్తా చాటుతోంది. మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లలో విజయం సాధించి అందరినీ నివ్వెరపరచిన ఆ పార్టీ, తాజాగా ఆ రాష్ట్రంలోని ఔరంగాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించింది. ఔరంగాబాదు కార్పొరేషన్ లోని 54 వార్డుల్లో బరిలోకి దిగిన మజ్లిస్ పార్టీ, బరిలో దిగిన తొలిసారే ఏకంగా 25 వార్డుల్లో విజయదుందుభి మోగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని బైకుల్లా నియోజకవర్గంతో పాటు ఔరంగాబాదు (సెంట్రల్) స్థానాన్నీ మజ్లిస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజా కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఔరంగాబాదు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇంకో ఆసక్తికర అంశమేంటంటే, కార్పొరేషన్ లో ఆ రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ కంటే కూడా మజ్లిస్ కే అధిక వార్డులు దక్కాయి. మజ్లిస్ 25 వార్డుల్లో విజయం సాధిస్తే, బీజేపీ కేవలం 22 సీట్లకే పరిమితమైంది.

More Telugu News