తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి మరోమారు ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘‘సీఎం కేసీఆర్ తో బంగారు తెలంగాణ కాదు కదా, రోల్డ్ గోల్డ్ తెలంగాణ కూడా రాదు’’ అంటూ ఆయన నిన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదిలాబాదు జిల్లా కాగజ్ నగర్ లోని ఎస్పీఎం మిల్లును తెరవాలని కార్మికులు చేస్తున్న దీక్షలకు రేవంత్ రెడ్డి నిన్న సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘బంగారు తెలంగాణ తెస్తారన్న కొండంత ఆశతో ప్రజలు కేసీఆర్ కు ఓటేశారు. అయితే ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు. ఎస్పీఎం మిల్లుకు రూ.100 కోట్లిస్తే సమస్య పరిష్కారమవుతుంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సర్కారు మెడలు వంచైనా మిల్లును తెరిపిస్తాం’’ అని ఆయన అన్నారు. ఇటీవల మరణించిన మిల్లు కార్మికుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.