తెలుగు రాష్ట్రాల విభజన హేతుబద్ధంగా జరగలేదని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. మన్మథ నామ ఉగాదిని పురస్కరించుకుని తుళ్లూరు మండలం అనంతవరంలో జరుగుతున్న వేడుకలకు హాజరైన ఆయన విభజనపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ, గడచిన ఎన్నికల్లో ఫలితం అనుభవించిందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరుల మధ్య ప్రాంతమే కొత్త రాజధానికి అనుకూల ప్రాంతమని, అందుకే అక్కడే రాజధానిని నిర్మిస్తున్నామని అన్నారు. ప్రపంచస్థాయి నగరంగా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగని రీతిలో చర్యలు తీసుకుంటామన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా కొత్త రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు.