ఏపీలో అసెంబ్లీలో బుధవారం చోటుచేసుకున్న రగడపై ఓ టీవీ చానల్ టీడీపీ నేత బొండా ఉమ, వైసీపీ నేత రోజాలతో చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, సభలో జరిగిన విషయాలకు సిగ్గుతో తలదించుకుంటున్నానని అన్నారు. టీడీపీ సభ్యులు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. విడుదల చేసిన ఫుటేజ్ లో వాస్తవాలు లేవని అన్నారు. తమకు కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. సిగ్గు పడాల్సింది బొండా ఉమ, పీతల సుజాత తదితరులేనని రోజా మండిపడ్డారు. అందుకు బొండా ఉమ చురుగ్గా స్పందించారు. అసెంబ్లీలో పోడియం వద్ద దృశ్యాలు చూస్తే సిగ్గుపడాల్సింది ఎవరో స్పష్టమవుతుందని కౌంటర్ విసిరారు. దీనికి రోజా బదులిస్తూ, తాను కేవలం నిరసన వ్యక్తం చేశానని అనగా, చెప్పులు చూపించడం, చంపేస్తానని అనడం నిరసన కిందకు వస్తుందా? అని ఉమ ప్రశ్నించారు.
"మీ కొడుకు ఎవరినో కారుతో గుద్ది చంపేసిన కేసులో ఎలా బయటపడ్డారో చెప్పగలరా?" అంటూ రోజా సవాల్ విసరగా, "రోజా... నీ పర్సనల్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి. వాటిని బయటకు తీస్తా" అని హెచ్చరించారు. ఈ దశలో చర్చ పక్కదారి పడుతోందని భావించిన కార్యక్రమ సంధానకర్త ఇరువురిని మళ్లీ టాపిక్ దిశగా మళ్లించారు. అంతకుముందు, మధ్యలో ఫోన్ లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన పీతల సుజాత కూడా రోజాపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.