ఏనుగును ఢీకొట్టిన కారు... చిత్తూరు జిల్లాలో నానాయాగీ చేసిన గజరాజులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏనుగును ఢీకొట్టిన కారు... చిత్తూరు జిల్లాలో నానాయాగీ చేసిన గజరాజులు

ఒక కారు ఢీకొట్టిన ఘటనలో ఏనుగు మృతి చెందింది. గుంపులోని ఒక ఏనుగు మరణించడంతో మిగతా వాటి కోపం కట్టలు తెంచుకుంది. కారును ధ్వంసం చేసి అందులో ఉన్నవారిని తోక్కేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా కృష్ణగిరి-హోసూరు జాతీయ రహదారిపై జరిగింది. సహచర ఏనుగు మృతితో గజరాజులు నానాయాగీ చేస్తూ, బీభత్సం సృష్టించాయి. సుమారు 40 ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీకొనగా, అందులోని ఓ ఏనుగు అక్కడిక్కడే మృతి చెందింది. ఇది చూసిన ఏనుగులు ఆవేశంతో ఊగిపోయాయి. ఘీంకారాలు చేస్తూ కారుపై దాడి చేశాయి. కారును నుజ్జు నుజ్జు చేశాయి. అందులోని ప్రయాణికులను చంపేందుకూ ప్రయత్నించాయి. వారు అతి కష్టం మీద కారు నుంచి బయట పడి ప్రాణాలు కాపాడుకున్నారు. ఏనుగుల దాడి సంఘటనతో జాతీయ రహదారిపై దాదాపు నాలుగు గంటలపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏనుగులకు ఆహారం, నీళ్లు లేకనే అడవినుంచి జనారణ్యంలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

More Telugu News