ఆర్ఎస్ఎస్ పై ధ్వజమెత్తిన అజమ్ ఖాన్
దేశంలో మత మార్పిళ్లపై విశేషంగా ప్రచారం చేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ మంత్రి అజమ్ ఖాన్ ధ్వజమెత్తారు. ఈ హిందుత్వ సంస్థ అనుసరిస్తున్న సిద్ధాంతం దేశంలో పౌర యుద్ధానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అరాచకత్వానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. "దేశంలో కట్టుబాట్లు లేని వాతావరణం నెలకొనాలని వారు కోరుకుంటున్నారు. అది, ప్రజల మధ్య యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధాన్ని ఎన్నటికీ అదుపు చేయలేం" అని పేర్కొన్నారు. ఆదివారం ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.