ఇండియాలోని జైళ్లలో మగ్గుతున్న వారిలో 53 శాతం మంది దళిత, ముస్లిం, ఆదివాసి తరగతులకు చెందిన వారని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం 4.2 లక్షల మంది వివిధ కేసులలో శిక్షను అనుభవిస్తూ జైళ్లలో ఉండగా, అందులో 20 శాతం మంది ముస్లింలు. 22 శాతం మంది దళితులు కాగా, 11 శాతం మంది ఆదివాసీలు జైళ్లలో ఉన్నారని కేంద్ర గణాంకాల శాఖ వివరించింది. జైళ్లలో వీరి సంఖ్య ఎక్కువగా ఉందన్న నెపంతో... ఈ వర్గాల వారు అధికంగా నేరాలు చేస్తున్నారని భావించరాదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. జైళ్లలో ఉన్న వారిలో 68 శాతం మంది విచారణ ఖైదీలే. వీరిలో చాలా మందికి సులభంగా బెయిల్ లభిస్తుంది. అయితే, ఆర్థికంగా వెనుకబడి ఉండటం, కనీసం బెయిల్ కోసం కావాల్సిన డబ్బులు కూడా లేకపోవటంతో వీరంతా బయటకు రాలేకపోతున్నారు. వందల మంది ముస్లిం యువకులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి, ఆ తరువాత నిర్దోషులుగా బయట పడ్డారని ఢిల్లీ హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ రాజేందర్ సచ్చార్ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ వెల్లడించింది.