పూర్వం ఓ వ్యక్తికి మరో వ్యక్తి పూర్తిగా లొంగిపోయి చాకిరీ చేయడాన్ని బానిసత్వంగా భావించేవారు. నేటి రోజుల్లో ఓ వ్యవస్థకు వ్యక్తులు లొంగిపోయి చాకిరీ చేయడాన్ని ఆధునిక బానిసత్వం అనొచ్చు! వ్యభిచారిణులు, నిర్బంధ కార్మికులు, పత్తి, గంజాయి సాగులో కూలీలు, ఇటుక బట్టీలలో పనివాళ్లు... వీరందరూ ఆధునిక బానిసల కోవలోకే వస్తారు. అలాంటి వాళ్లు భారత్ లోనే అధికమంటోంది గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ (జీఎస్ఐ) తాజా నివేదిక. భారత్ లో 35.8 మిలియన్ల మంది ఈ ఆధునిక బానిసత్వంలో మగ్గిపోతున్నారట. దుర్భర దారిద్ర్యమే అందుకు కారణమని నివేదిక చెబుతోంది. ఈ నివేదికను జీఎస్ఐ తరపున ఆస్ట్రేలియాకు చెందిన వాక్ ఫ్రీ ఫౌండేషన్ రూపొందించింది. అప్పులు తీర్చలేక కొందరు, పేదరికం కారణంగా మరికొందరు, బలవంతంగా ఇంకొందరు... ఇలా, బానిస బతుకు వెళ్లదీస్తున్నారని వాక్ ఫ్రీ ఫౌండేషన్ చైర్మన్ ఆండ్రూ ఫారెస్ట్ విశ్లేషించారు. ఇక, ఈ విషయంలో భారత్ తర్వాత స్థానంలో ఉజ్బెకిస్థాన్ ఉంది.